Sunday, September 1, 2013

ఫేషియల్

 ఇది వరకు ఇంటి బయట పేడతో కల్లాపి జల్లి, ఇల్లు అలికేవారు. ఇప్పుడు మొహాలు అలుకుతున్నారు. నేను ఇలా అంటుంటే, నా ప్రియ సఖులకు కోపం వస్తుందేమో... అయినా, నాకు ఎందుకనో ఇది హాస్యాస్పదంగానే అనిపిస్తుంది. అదే నండీ, ఆ అలకడాన్నీ, ఫేషియల్ అంటారు. 

ముల్తాని మట్టితో మొహం అలికితే, మొహం అప్పుడే తోమిన గుండు చెంబులా తళతళ లాడిపోతుంది. నా రకాల పళ్ళతో అలికితే, ఏదో ఒకటి పని చేసి, మోము  100 కాండిల్ బల్బు లా వెలిగిపోతుంది. ఇక చిన్నప్పటి చిట్కా, శనగపిండిలో, పుల్లపెరుగు, పసుపూ కలిపి పట్టిస్తే, ముందు వేసుకోగానే చూసిన వాళ్ళు జడుసుకున్నా, కడిగేసాకా, 'నువ్వేనా, నా నువ్వేనా ...' అంటూ హాస్చర్య పడిపోయేస్తారు . ఈ మధ్య హెర్బల్ ఫేషియల్, సిల్వర్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, మరియు ... తాజాగా అసలయిన డైమండ్ ఫేషియల్ వచ్చేసాయి. 'ఆయనే ఉంటె మంగలి ఎందుకు...' అని, వజ్రాలు ఉంటే , పూబోణులు మెళ్ళో వేసుకోక, మొహానికి అలుక్కుని, కడిగేస్తారుటండీ ? ప్లాటినం ఫేషియల్ ఉందొ లేదో, నాకు తెలీదమ్మా, చెలులూ ... ఉంటే మంచి తరుణం మించిన దొరకదు, చేయించేసుకోండి .

ఈ ఫేషియల్ ధర ఐదు వందల నుంచి, కొన్ని వేల రూపాయిల దాకా ఉంటుంది. వన్ గ్రాము బంగారానికి ఇచ్చినట్టు, అంత పెట్టుబడి పెట్టినందుకు, ఏడాది గారెంటీ అంటే యెంత బాగుండు!

పచ్చిమిరపకాయల పేస్టు తో ఫేషియల్ ఇంకా ఎందుకు కనిపెట్టలేదు చెప్మా! బహుసా చవగ్గా, ఉంటాయి కదా, పెద్దగా లాభాలు రావనేమో!

మా కజిన్ బ్యూటీ పార్లర్ నడుపుతుంది. తను తమాషాగా మాట్లాడుతుంది. 'అక్కా, ఈ మధ్య ఫోన్లు లేవు, ఏంటి సంగతి... అంటే , 'ఏం చెప్పమంటావే , ఊళ్ళో పెళ్ళికి కుక్కలా హడావిడి అని, పెళ్ళిళ్ళ సీజన్లో మొదలయితే చాలు, ఒకటే రద్దీ. ఆ ఫేషియల్, ఈ ఫేషియల్, అంటూ మొహాలు రుద్దీ, రుద్దీ, చేతులు అరిగిపోతున్నాయి. ఎలుక తోలు యెంత తోమినా, నలుపు వదలదని , అర్ధం చేసుకోరూ... అయితే, దీని వల్ల నాకు ఒక లాభం కలిగిందే! తోమడం అలవాటు అయిపోయి, నాలుగు రోజులు పనమ్మాయి రాకపోయినా, సబీనా వేసి, బండెడు గిన్నెలూ అలవోకగా తోమేసుకుంటున్నా! ఒక నష్టం కూడా ఉందనుకో, రాత్రి కళ్ళు మూసుకుంటే, భూతాల్లాగా, ఆ పేస్టు పులిమి, కాళ్ళ మీద రెండు దోసకాయ ముక్కలు పెట్టిన మొహాలే గుర్తుకొస్తున్నాయి. ' అంది. నవ్వలేక చచ్చాను నేను.

చెలులారా, ఇవన్ని పట్టించుకోవద్దు. సౌందర్య సంరక్షణే మన తక్షణ కర్తవ్యం . అరవై లో ఇరవై లాగా, మనం సంతూర్ అమ్మలం అయిపోదాం... అందమే ఆనందం... 

దాగుడుమూతలు

'అమ్మా ! నేనేక్కడున్నానో చెప్పుకో,' అరిచింది నా చిన్న కూతురు.

దాక్కుని అరిస్తే, ఎక్కడుందో చెప్పుకోలేమా, చప్పున పట్టేసుకున్నాను.

'నేనెప్పుడూ ఇలాగే దాక్కుంటా, గుర్తుందా బెంగుళూరు లో ఉన్నప్పుడు ఎలా దాక్కున్నానో,' అంది.

'ఎప్పుడే?'

'హబ్బా, అన్ని మర్చిపోతావ్, నువ్వొక పెద్ద ఐసరబజ్జవి . ఆ రోజు నేను కనబడలేదని, మీరు వెతుక్కున్నారు...'

ఒక్కసారిగా వొళ్ళు జలదరించింది. ఆ సంఘటన తలచుకుంటే ఇప్పటికీ నవ్వాలో, ఏడవాలో తెలియని సందిగ్ధం. ఒకే కడుపున పుట్టిన పిల్లల్లో యెంత వైవిధ్యమో! మా పెద్దమ్మాయి చిన్నప్పటి నుంచీ భయస్తురాలు. దాని గురించిన జాగ్రత్త అది తీసుకునేది. ఆలోచించి అడుగు వేసేది. అయితే కూర్చున్న చోటే, అందుబాటులో ఉన్న దిళ్ళ దూది, గౌనుకున్న పూసలు, చిన్న దారాలు, టీవీ రిమోట్ బటన్లు అన్నీ భొంచేసేసేది. ఆ రకంగా దాన్ని గమనించుకోవలసి వచ్చేది.

ఇక చిన్నది చాలా కొంటేది. దానికి ఆనందం వచ్చినా, దుఖం వచ్చినా, సినిమాల్లో శ్రీ లక్ష్మిలాగా అందుబాటులో ఉన్న కిటికీలు, తలుపులు ఎక్కేసేది. దాన్ని తలుపేసి బంధించి పెడితే, పాలవాడు, కొరియర్ వాడు రాగానే పారిపోయేది. రైల్ లో వెళ్తుంటే, పై బెర్త్ లకు ఎక్కుతూ, దిగుతూనే ఉండేది. ఒక్క నిముషంలో సబ్బు ముక్కలా జారిపోయేది . ఒక సారి పాలు పోయించుకుని చూసే లోపు, రెండో అంతస్తు లో ఉన్న మా ఇంటి మెట్ల మీది నుంచీ దూకేసి, పక్కింటి మెట్ల మీద నుంచీ వాళ్ళ సన్ షేడ్ మీదకు ఎక్కేసి, అమ్మా, చూడు, అంది. నాకు గుండె జారిపోయింది. మెల్లిగా ధైర్యం తెచ్చుకుని, 'ఎలా వెళ్ళావో, అలాగే రామ్మా ' , అని మెల్లిగా అక్కడి నుంచీ దింపి తెచ్చి, వీపు సాపు చేసేసాను. ఇంకో సారి నాలుగు అడుగుల గోడ మీది నుంచి పడి, తల బొప్పి కట్టించుకుంది. నేను, మా వారు, మూడు రోజులు తపస్సు చేసాం. అప్పుడు దాని వయసు, రెండేళ్ళే!

మరో ఆరు నెలలకు మేము సొంత ఫ్లాట్ కొనుక్కుని వెళ్ళాకా, అప్పటి దాకా ఇంట్లోనే ఉన్న పిల్ల కనిపించలేదు, రాత్రి తొమ్మిది. వెంటనే అందరికీ ఇంటర్కాం లో ఫోనులు చేసాము. నా నోటి మంచితనం వల్ల , నా మిత్రులంతా, వెతకడానికి బయలుదేరారు. క్రింద స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వేల్లిందేమో, లేక రోడ్డు మీదకు వెళ్ళిపోయిందో, లేక, ఆ 14౦ ఇళ్ళలో ఎక్కడ ఉందొ, అంతా గందరగోళం భయం. సెక్యూరిటీ వాళ్ళు క్రిందకు రాలేదు అన్నారు. అంతా, ఆలోచిస్తూ, అటూ, ఇటూ పరిగెత్తసాగాము. నా కళ్ళలో నీళ్ళు తిరగసాగాయి. ఎందుకో, నా స్నేహితురాలికి, ఇంట్లోనే ఎక్కడో ఉందేమో, అన్న అనుమానం వచ్చింది. దాని సంగతి తెలిసి ఉండడం వల్ల మేము ముందే, మంచాల క్రింద, అలమారుల్లో వెతికేసాము. ఎందుకయినా మంచిదని, మా వారు వెళ్లి చూద్దురు కదా, బంక్ బెడ్ మీద, పెద్ద టెడ్డి బేర్ వెనుక, దాక్కుని, పైన సాఫ్ట్ టాయ్స్ కప్పుకుని,హాయి  గా నిద్రపోతూ కనిపించింది. అంతా, దాని కొంటె తనానికి నవ్వుకుని, వెళ్ళిపోయారు. 

ఇప్పుడు దానికి ఏడేళ్ళు. కాస్త అల్లరి తగ్గింది, కాని ధాటి అలాగే ఉంది. బాగా అల్లరి చేసే పిల్లలు ఒక వయసు వచ్చాకా, బుద్ధిమంతులు అవుతారని అంటారు. నాకు యెంత మాత్రం నమ్మకం లేదండి. ఆటలు, అల్లరి, ఎలా మానుతుందో వేచి చూడాలి.

నాటి పాట - నేటి పాట

హాయిగా నవ్వుకుని చాలా రోజులు అయ్యింది కదూ... మరేం పరవాలేదు, నేనున్నానుగా... అచ్చంగా మీ నవ్వుల కోసమే రాస్తుంటానుగా ... ఒక ఊహాజనిత చదవండి.

ఓ కుర్రాడికి పెళ్లి కుదిరింది. రిసెప్షన్ కోసం అతని మిత్రులు విదేశాల నుంచీ వస్తున్నారు. ఈ రోజుల్లో సందడి అంటే, వంట్లో ఉన్న ఆవేశం అంతా చల్లరేదాకా, పూనకం వచ్చినట్లు గెంతడమే కదండీ, అందుకే, అతను తన మిత్రుల కోసం 'లేటెస్ట్ సాంగ్స్ ట్రూప్' సంగీత కార్యక్రమం పెట్టాలని నిర్ణయించుకున్నాడు.

అయితే, పెళ్ళికొడుకు తండ్రికీ పెద్ద మిత్ర బృందం ఉంది. వాళ్ళు పాత పాటలంటే చెవి కోసుకుంటారు, కొత్త పాటలంటే చెవులు మూసుకుంటారు. వాళ్ళందరి కోసం, ఆయన 'పాత బంగారం' అనే వారి సంగీత విభావరి పెట్టాలని నిర్ణయించుకున్నాడు.

ఈ విషయంగా, తండ్రీ కొడుకులకు పంతాలు రేగాయి. ఒక్కడే కొడుకు, పెళ్ళిలో సందడి చెయ్యాలన్న ఉత్సాహం ... చివరికి ఉత్తరంవైపు పాతపాటలు, దక్షిణం వైపు కొత్త పాటలు పెట్టారు. పోటాపోటీగా పాటల హోరు మొదలయ్యింది.


'కళ్యాణ వైభోగమే... శ్రీ సీతారాముల కళ్యాణమే...' అంటుంటే, యువకులు బావిలోంచి, ఏదో గొంతు పాడుతున్నట్టు, మొహాలు తేలేసి విన్నారు.

'వద్దురా, సోదరా, పెళ్ళంటే నూరేళ్ళ మంటరా... ఆదరా బదరా నువేల్లెల్లి గోతిలో పడద్దురా...' అనగానే కుర్రాళ్ళు లేచి, కాసేపు తాళానికి ఊగి కూర్చున్నారు.

' దయగల తల్లికి మించిన దైవము లేనే లేదుగా...' కుర్రాళ్ళు ఆముదం తాగినట్టు మొహాలు పెట్టారు, పెద్దవారు లీనమయిపోయి వింటున్నారు.

'అబ్బో నీ అమ్మ గొప్పదే, నిన్ను అందం పోగేసి కన్నదే....' , కుర్రాళ్ళు కాసిన్ని స్టెప్పులు వేసారు, పెద్దవాళ్ళు కళ్ళూ, చెవులూ మూసుకున్నారు.

' ఎక్కడ ఉన్నా ఏమయినా... మనం ఎవరికి వారే వేరయినా...' కురాళ్ళు కుర్చీల క్రింద తలదాచుకున్నారు, పెద్దలు తాళం వెయ్యసాగారు.

' నేనాడికేల్తే నీకేంటన్నాయ్... నేను ఏటిచేస్తే నీకేంటన్నాయ్....లాయి లాయి జుల్లాయి లాయి...' కురాళ్ళు కుర్చీలు ఎక్కి గెంతసాగారు. పెద్దలకు ఒళ్ళు మండిపోతోంది. 

'అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, బతకరా బతకరా పచ్చగా...'

'సత్తే... అరె సత్తే, జరా సత్తే, ఓహో సత్తే.... సత్తే ఏ గొడవా లేదు, సత్తే ఏ గోల లేదు, పుట్టే ప్రతీ వాడు సత్తడోయ్... కలకాలం కాకుల్లగా బతికేస్తే ఏమొస్తుంది హంసల్లె దర్జాగుండాలోయ్...' కుర్రాళ్ళు ఉత్సాహం పట్టలేక పాడే వాడి చుట్టూ చేరి గెంత సాగారు. 

పెళ్లింట్లో చావు పాట పాడతాడా , నెల తక్కువ వెధవ, ఇలాక్కాదు, వీళ్ళని, శాస్త్రీయ సంగీతంతో కొట్టాలి, అనుకుని, పెద్దలు గాయకుడి చెవిలో ఏదో చెప్పారు. వెంటనే, మంచి పాట మొదలయ్యింది. పెద్దలూ, పిల్లలూ అంతా మౌనం... రాళ్ళు కరిగే ఆ పాటకు తిరుగు ఉందా?

'శివ శంకరీ....శివానందలహరి....' ఆ పాటకు ఎదురు ఉందా? అంతా హాయిగా విని, పెళ్లి వేడుకలకు వెళ్ళిపోయారు... కధ కంచికి, మనం పేస్ బుక్ కి.



సరదా సమయం

అతిశయం 

ఇద్దరు జాలర్లు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు ఎలా ధైర్యంగా ఎదుర్కున్నది, ఎలా సుడిగుండాలు తప్పుకున్నదీ, చెప్పుకుంటున్నారు.

అందులో మొదటి వాడు, 'నేనొకసారి నడి సముద్రంలో వల వెయ్యగా, ఒక 200 కిలోల బరువు ఉన్న పెద్ద చేప నా వల్లో పడింది. అది తప్పించుకోవాలని, నన్ను సముద్రంలోకి లాగాలని ప్రయత్నించింది. అయినా నేను దానితో వీరోచితంగా పోరాడి, దాన్ని చంపి తీసుకువచ్చా,' అన్నాడు. 

రెండవ వాడు ఏమీ మాట్లాడలేదు. అంతా విని, తానెప్పుడూ అటువంటి సాహసం చెయ్యలేదని, ఒప్పేసుకున్నాడు. కాని, నువ్వు చెప్పేది వింటే, నాకొక విచిత్రమయిన సంఘటన్ గుర్తుకు వస్తోంది, విను. ' ఒక సారి నేనొక చెరువులో వల వెయ్యగా, ఒక పురాతన లాంతరు వచ్చింది. దాంట్లోకి నీళ్ళు వెళ్ళకుండా పైన ఏదో పూత ఉన్నట్టు ఉంది. చిత్రమయిన సంగతి ఏమిటంటే, దాంట్లోని లైటు ఇంకా వెలుగుతూనే ఉంది, ' అన్నాడు.

అంతా విన్న మొదటివాడు, 'సరే అయితే, ఒక ఒప్పందానికి వద్దాం. నేను నా చేప బరువును ఒక వంద కిలోలు తీసేస్తాను, నువ్వు నీ లాంతర్లోని లైటు తీసెయ్ ,' అన్నాడు.

                                                          

శ్రీవారి చురకలు 


ఆంగ్ల భాష లోని జాతీయాలు (ఇడియోమ్స్) గురించి చదువుతూ మా వారి దగ్గరకు వచ్చింది నా పెద్ద కూతురు.

"నాన్నా! ది పెన్ ఇస్ మోర్ మైటిఎర్ థాన్ ది స్వోర్డ్ ..." అంటే ఏమిటి?

"మరేం లేదమ్మా! మీ అమ్మ పెన్నుతో అక్షర అస్త్రాలు సంధిస్తుంది కదా! అప్పుడు కత్తితో పొడిచినా ఏడవని గుండె ధైర్యం ఉన్నవాళ్ళు  కూడా, ఆ శరా ఘాతానికి బ్రహ్మానందం నేల మీద పడిపోయి ' నే జచ్చిపోతా, నే చచ్చిపోతా ' అంటూ గిలా గిలా కొట్టుకున్నట్టు బాధపడిపోతారు కదా ! అందుకే పెన్ కు గన్ కంటే ఎక్కువ బలం ఉందని చెప్పడానికి ఆ జాతీయం వాడతారు," అన్నారు.

పద్మిని జాతీయాలకు ఉదాహరణ క్రింద కూడా పనికి వస్తోంది. మా వారు అంతేలెండి, నన్ను అలా ఆటపట్టిస్తూ ఉంటారు. అంతా విష్ణుమాయ.

స్త్రీల కాలమానం 

స్త్రీల కాలమానం దేవతల కాలమానానికి దగ్గరగా ఉంటుంది - ముఖ్యంగా అలంకరణ విషయంలో. సినిమాకి వెళ్ళేముందు - ఒక మాములు క్షణం ఒక పురుషయుగం. అలాటి పురుషయుగాలు రెండు కోట్లు కలిస్తే ఒక స్త్రీనిముషం. అలాటి నిముషాలు నూటయాభై అయితే ఒక చీర సింగారింపు. నూరు చీరసింగారింపులు ఒక పోడరు కోటా. నూరుకోటాలకాలం ఒక తిలక ధారణ. నూరు తిలకాలు కలిస్తే ఒక దర్పణప్రతిబింబ పర్యవేక్షణ.
.... ముళ్ళఫూడి

జీవితమే ఒక ఆట

జీవితమే ఒక ఆట 

ఆ మధ్య ఒకరి ఇంటికి వెళ్లి చూద్దును కదండీ, ఆయన టీవీ ముందు గెంతుతున్నారు. అరె, ఇంటికి మనుషులు వచ్చినా ఆపకుండా మిరపకాయ తిన్న కాకి లాగా అలా ఎగురుతున్నారు ఏంటా , అని నాకు ఆశ్చర్యం కలిగింది. ఆయన ఆపకుండా అలా ఎగురుతూనే, ఒక చేత్తో నన్ను కూర్చోమన్నట్టు సైగ చేసారు. పోన్లే టీవీల్లో పాటలకి ఎగరడం, వేలాడడం, పొర్లడం అన్నీ చూడట్లా, అయినా, ఎగిరేది ఆయన అయితే, చూసే నాకెందుకు ఆయాసం, అని సరిపెట్టుకుని కూర్చున్నాను.

ఇంకాసేపు చూద్దును కదా, ఆశ్చర్యం, ఆయన కదలికలకు అనుగుణంగా, టీవిలో బొమ్మ కదులుతోంది. ఆయన ఎటు వంగితే అటు వంగుతోంది, ఆయన గెంతితే ఎగురుతోంది. వెంటనే నాకు జీన్స్ చిత్రంలోని 'వర్చ్యువల్ రియాలిటీ ' గుర్తుకు వచ్చింది. ఓహో, ఇదేదో ఆ తరహా ఆటలా ఉందే , అనుకున్నాను. నేను అలా కూర్చుని ఉండగానే ఆయన తెప్ప మీద నదిలో వెళ్ళిపోతున్నారు, గాల్లో ఎగురుతున్నారు, డబ్బుల నాణేలు పోగేసుకుంటున్నారు, నిండా మునిగి తేలుతున్నారు. ఈ వినోదం చూస్తూ కూర్చుంటే, ఈ లోపల వారి శ్రీమతి వచ్చింది.

ఆవిడ ఆల్చిప్పల్లా, నిలువు గుడ్లేసుకుని చూస్తున్న నా భావాన్ని గమనించి, "ఏమీ అనుకోకండి, అదీ ఆయన వ్యాయామం చేస్తున్నారు. ఈ మధ్యన కొంపలు పిచ్చుక గూళ్ళ లాగా తయారయ్యాయి కదా, పోనీ బయటకు వెళ్దామంటే, ఎండా, వాన, చలి,దొంగలు, ఇబ్బందులు. అందుకే, ఎవరో పుణ్యాత్ముడు " వ్యాయమ వీడియో గేమ్స్ " తయారుచేసారు. దాని ధర అక్షరాలా యాభై వేలు. దానిలో మన కదలికలను గుర్తించే సేన్సర్స్  ఉంటాయి. రోజుకొక అరగంట  దాని సైగలకు తగ్గట్టు గెంతితే, వ్యాయామం అయిపోతుంది. ఇందులో మొగుడూ పెళ్ళాలు జంటగా గెంతే వీలుంది. అంటే, ఇద్దరు ముగ్గురు కలిసి టీవీ ముందు వ్యాయామం చెయ్యవచ్చన్నమాట. ఇందులోనే రకరకాల గేమ్స్, అన్ని వయసుల వారికీ వ్యాయామాలు వేర్వేరు ధరల్లో అందుబాటులో ఉన్నాయి. కొనుక్కున్న వాళ్లకి కొనుక్కున్నంత , కొరివితో తల గోక్కున్నంత. 'ఆరోగ్యమే మహాభాగ్యం ' కదండీ, అందుకే, రోజులని బట్టీ, వ్యాయామపద్ధతులు కూడా ,మారాయి," అంది ఆవిడ.
 
                

ఈ వీడియో గేమ్స్ పుణ్యమా అని, జగమే ఒక క్రీడాస్థలం అయిపొయింది. మా చిన్నప్పుడు లక్కపిడతల్లో అటుకులూ, పప్పులూ వేసుకుని, వంట చేస్తున్నట్టు చాలా సేపు ఆడుకునేవాళ్ళం. మేము వండింది గొప్పగా మా అమ్మకు పెట్టే వాళ్ళం. మా చెక్క బొమ్మలకు చీరలు కట్టేవాళ్ళం. తరం మారినా, ఆటలు మారలేదండోయ్ ... మా పిల్లలు కంప్యూటర్ లో బార్బీ డ్రెస్సింగ్ గేమ్స్ ఆడతారు. ఆ విదేశీ బొమ్మకు బట్టలు కట్టి, జుట్టు పీకి, బోడిగుండు మీద నిల్చోబెడతారు. హ్యాండ్ బాగ్, లిప్స్టిక్ తొడిగి, దాన్ని ఊసరవెల్లి లాగా తయారుచేసి వదులుతారు. అవి కాక, కుకింగ్ గేమ్స్ కూడా ఉన్నాయి. అందులో, వీళ్ళు, కేకులు, పిజ్జాలు, బ్రౌనీస్ , రకరకాల విదేశీ చెత్త అంతా, పిండి కలిపి చేసేస్తారు. అయితే, ఇక్కడ అమ్మలకు మాత్రం అవి తినే దౌర్భాగ్యం లేదు. 

ఆటల్లో నాకు నచ్చే ఒకేఒక ఆట  'ఆంగ్రి బర్డ్స్' . ఇందులో పిట్టలు కొట్టే వడిసేలు సహాయంతో దాక్కున్న పందుల్ని చంపాలి. అయితే, పిట్ట దెబ్బకి పంది చస్తుందిటండీ ? చచ్చదు , పైగా పళ్ళికిలించి నవ్వుతుంది. అప్పుడు మాత్రం నాకు ఉడుకోచ్చేస్తుంది. పవర్ తీసుకు మరీ కొట్టెస్తాను.పట్టు వదలని లేడి విక్రమార్కుడి లాగా , మళ్ళి మళ్ళి ఆడి ,పంది మీద పిట్టాస్త్రం వేసేస్తాను. ఆటలో లీనమైనప్పుడు పందిని చంపడమే నా తక్షణ కర్తవ్యం....
 
పెద్దా చిన్నా తేడా లేకుండా, మొబైల్ లో, ట్యాబు లో, డెస్క్టాపు లో, టీవీల్లో , చిన్న యంత్రాలలో అన్నిటా వీడియో ఆటలే. 'ఇందు కలదు అందు లేదు అని సందేహము వలదు, ఎందెందు వెతికి చూసిన వీడియో గేమ్ అందందే కలదు...' . అంగుళం కదలకుండా ఆడే దశ నుంచీ, మనల్ని గెంతించే దాకా ఎదిగింది వీడియో గేమ్. మున్ముందు ఇంకెన్ని చోద్యాలు చూడాలో, కాస్కోండి, దెబ్బకు ఠా మనుషుల ముఠా. 

నిరసన

ఒంటికాలిపై నిల్చుని నిరసన తెలిపారు...

మోకాళ్ళపై నిల్చుని నిరసన తెలిపారు....

పిండాలు పెట్టి నిరసన తెలిపారు....

అర్ధనగ్నంగా మోకాళ్ళపై నిల్చుని నిరసన తెలిపారు....

రోడ్లు ఈనెల చీపుళ్ళతో ఊడుస్తూ నిరసన తెలిపారు....

రోడ్డుమీద వంటలు చేసుకు తిని నిరసన తెలిపారు...

పురాణపురుషుల వేషాల్లో నిరసనలు...

గోదాట్లో నిల్చుని నిరసన తేలిపారు....

నడి రోడ్డు మీద పెళ్లి చేసుకుని నిరసన తెలిపారు....

ఎంతయినా, మన వాళ్ళ సృజన గోప్పదండీ. యెంత వెరైటీ సృష్టిస్తున్నారు. ఇటువంటి అర్ధం పర్ధం లేని నిరసనల వల్ల మీడియా కవేరేజ్ దక్కుతుంది కాని, ఉద్యమ స్పూర్తి దెబ్బతింటుంది. స్త్రీ పురుష భేదం లేకుండా, మీడియా కవరేజ్ కోసం చేసే కొన్ని విన్యాసాలు చూస్తే, భలే వింతగా అనిపిస్తోంది. అందుకే, నేను మన హైదరాబాదీ ల కోసం కొన్ని కొత్త నిరసనా పద్ధతులు కనిపెట్టేసా! మీరంతా తోడు వస్తారని, నాకు తెలుసులెండి.

1. మూసీ నది ఒడ్డున ముక్కు మూసుకుని, నిరసన తెలుపుదాం.

2. బిర్లా మందిరం కొండెక్కి గగ్గోలు పెట్టి నిరసన తెలుపుదాం.

3. ట్యాంక్ బండ్ చుట్టూ బొంగరంలా పరిగెట్టి నిరసన తెలుపుదాం. బుద్ధుడి, చుట్టూ ప్రదక్షిణం చేసిన పుణ్యం వస్తుంది లెద్దురూ....

4. ఆమరణ పాని పూరి దీక్ష చేపట్టి, విడతలు విడతలుగా పాని పూరీలు తిని, నిరసన తెలుపుదాం.

5. హైటెక్ సిటీ ముందు యడ్ల బండ్ల రాలీ నిర్వహించి, నిరసన తెలుపుదాం....

6. ట్రాఫిక్ బాగా ఉన్న రోడ్డు మధ్యలో పిల్లిమొగ్గలు వేసి  నిరసన తెలుపుదాం...అలాగయినా  హైదరాబాద్ ట్రాఫిక్ లో కార్లలో, బైక్ ల మీదా నిద్దరోయే వాళ్లకు కాస్త కాలక్షేపం అవుతుంది.  

7.పార్కుల్లో గడ్డి పీకి నిరసన తెలుపుదాం...

8. 'నిరవధిక పేస్ బుక్ దీక్ష ' చేపట్టి, పగలూ రాత్రి చాట్ లతో సప్తాహం చేసి , నిరసన తెలుపుదాం....

9. వారం రోజులు స్నానాలు మానేసి నిరసన తెలుపుదాం... అసలే హైదరాబాద్లో నీటి సమస్య.

10. గణేశ చతుర్ధికి కేవలం దేవుడి పాటలు పెట్టి నిరసన తెలుపుదాం. ఇది అన్నిటికంటే సమర్ధవంతంగా పని చేసే ఉపాయం. 

ఏంటండీ,,, మీకు కూడా కొత్త కొత్త హైదరాబాదీ నిరసన ఆలోచనలు వచ్చేస్తున్నాయా ? ఇంకెందుకు ఆలస్యం, పదండీ పాటించేద్దాం, టీవీ లో కనబడడం. 

పేరులో ఏమున్నది?

'పేరులో ఏమున్నది పెన్నిధి...' అనుకుని, పోత పోసిన పాత పేర్లతో పిలిపించుకుని, సరిపెట్టుకునే రోజులు అనుకున్నారా? అబ్బే, తరం మారిపోయిందండీ , మీరింకా గమనించలా!

ఎవరో వస్తారని, ఏదో బిరుదు ఇస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నచ్చిన పేరు పెట్టుకోనుమా! అని తీర్మానించుకుని, కావలసిన పేర్లు పెట్టేసుకుంటూ ఉన్నారండీ...  పేస్ బుక్  లో  రోజూ పేరు మార్చుకునే సదవకాశం కూడా ఉంది.

ఇప్పటి పేర్లు చదవండి...

ప్రిన్సెస్ అప్పు (అప్పలమ్మ కాబోలు)
హీరో హరి 
ప్రిన్సు జానీ 
క్వీన్ లక్కీ 
గోపి విక్టరీ (అవున్నాయనా ... విక్టరీ గోడ మీద పిల్లి లాంటిదే)
బ్యూటీ రోజా (ఈవిడ ఫోటో చూస్తే తెలుస్తుంది, బ్యూటీ నో, బీస్టో)
అపరిచితుడు 
విక్కి డేంజరస్ 
ఫైర్ చింటూ 
డ్రీం గర్ల్ జానూ...

'వెర్రి వెయ్యి రకాలని,' ఇలా అర్ధం పర్ధం లేని పేర్లు పెట్టుకుని, తమని తాము గొప్పవారని మురిసిపోతూ ఉంటారు. మరి నలుగురితో నారాయణా అనమన్నారు కదండీ. అందుకే మనమంతా మనకి నచ్చినన్ని పేర్లు పిచ్చ పిచ్చగా మార్చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం... పదండి ముందుకు పదండి తోసుకు...