Monday, April 30, 2012

పేరు ప్రఖ్యాతులు


పేరు ప్రఖ్యాతులు
'డబ్బుదేముందండి? కుక్కని కొడితే వస్తాయి ,' అంటారు.
అలా అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టి, అకస్మాత్తుగా కోటీశ్వరుడు అయిపోయిన ఒక  పెద్దమనిషి సిటీకి వచ్చాడు. ఎక్కువ డబ్బుంటే ఏమి చేస్తారు? ఇల్లు, కార్, ...
డిపాజిట్లు అన్ని అయిపోయాక మిగిలేది కీర్తి, పేరుప్రఖ్యాతుల తాపత్రయం. దీనికి  అనాదిగా వస్తున్న'సినిమా తియ్యడం' అనే అమోఘమయిన పద్ధతిని ఎంచుకున్నాడు. మరి
వట్టి ప్రొడ్యూసర్ గా ఉంటే ఊరా పేరా? అందుకే ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్  మరియు కధ మరియు పాటలు మరియు స్క్రీన్ ప్లే మరియు మాటలు అన్ని తనే  అవ్వలనుకున్నాడు. అబ్బ, అవన్నీ ఆయన చెయ్యడు లెండి. ఆయన చదువుకోలేదు. మరెలా  అంటారా? అన్నీ చెప్పాలి మీకు. పేరు కోసం డబ్బు తగలెట్టడం ఆయన సరదా అయితే,  డబ్బు కోసం అన్ని తామే చేసేసి, వచ్చే పేరు అమ్మేసుకోవడం కొందరి అవసరం.
 

వయసయిపోయింది కనుక ఆయన హీరోగా మాత్రం విరమించుకుని, ఆ అవకాశాన్ని తన  మేనల్లుడికి ఇచ్చాడు. శేషాచలం అన్న అతని పేరును 'అచల్( అంటే కదలనిది అని ఆయనకు  తెలీదు) అని మార్చాడు. హీరోయిన్ గా మండపేట మాణిక్యం మరదలు పారిజాతం కుదిరింది. ఆవిడ పేరు ను 'రిజ' గా కుదించాడు. విదేశాల నుంచి వచ్చిన వలస పక్షి లాగ, తెలుగు రాని చవటాయి లాగ ఆమెని అందరికీ చెప్పమన్నాడు. సినిమా టైటిల్ 'తొండ ' .
ఏంటండి అలా నవ్వుతారు? ఈగ, డేగ, దోమ, ఇదే పంధాలో అన్నమాట. కధా మాధ్యమం  పల్లెటూరి లో పచారి కొట్టు యజమాని కొడుకు, తండ్రి వ్యాపారాన్ని చిన్న చూపు చూసి, software ఉద్యోగంలో చేరతాడు. రెసిషన్ వల్ల ఉద్యోగం ఊడిపోయిన అతను  తిరిగి గ్రామం లోని కిరాణా కొట్టు వ్యాపారమే చేసుకుంటాడు. సూపర్ మార్కెట్
యజమాని అవుతాడు. విదేశాల్లో అమ్మాయి పరిచయం, ఉద్యోగం పోయాక నిరాకరించడం, మళ్ళి  కాసేపటికి ప్రేమించడం, ఇది ఇతి వృత్తం.


కాప్షన్ 'తొండ  -ఎక్కడ  పోగాట్టుకున్నాడో అక్కడే వెతుక్కుంటాడు'.
స్క్రిప్ట్ రెడీ అయ్యాక మన అల్-ఇన్ -వన్ గారికి ఒక పాట రాయాలని అనిపించింది.  'ఇదిగో కవి, నేనో పాట రాయాలనుకుంటున్నా, ఏవన్నా అవిడియాలు ఉంటే ఇస్తావేటి?' అని అడిగాడు.
'పెద్ద కష్టం ఏమి లేదండి. ఎందుకంటే మీరేది రాసినా కల్లోలంగా వాయించే వాయిద్యాల హోరులో జనాలకి వినబడదు. పాడేవాడికి తెలుగు రాదు కనుక ఎలాంటి విపరీతాలు జరగవు.  ఇంక వినే వాళ్ళకి, డ్రమ్ముల శబ్దాలకి తల ఊపడం తప్ప గత్యంతరం లేదు. నేటివిటీ  కోసం పల్లెటూరికి వెళ్లి మీకు కనిపించింది అంతా రాయించెయ్యండి, అన్నట్టు టైటిల్ తొండ పాటలో రావాలన్దోయ్, ఏదో మీ సాల్ట్, సాంబార్ తిన్న విశ్వాసంతో  చెప్తున్నాను. ఆయన రాసేశాడు,మరి పాట చదవండి,
పల్లవి : తొండకు చెట్టు కొమ్మ లాగ దొరికావే, పిల్ల, ఊరపందికి బురద లాగ దొరికావే.
బండకు బండరాయి లాగ దొరికావే, పిల్ల, కడుపుకదిలితే చెంబు లాగ దొరికావే .
చరణం : గందరగోళం ఏదో జరుగుతోందే సంతలో,
తింగరమేళం ఏదో తిరుగుతోందే వీధిలో ,
తొందర తొందరగా వచ్చాడే గుర్నాధం,
చిందర వందరగా చేసేసాడే ఇంటందం,
టూత్ బ్రష్ కి పేస్టు లాగ , వొంటికి సబ్బు లాగ కలిసున్దామే..'
సినిమా చూసిన జనం ప్రత్యేకించి, దుప్పటి నెత్తిన వేసి చితగ్గోట్టేసి ,' ఒరే,  అది తొండ సినిమా కాదురా, తొక్కలో  సినిమా, ఆ పాట ఎంటిరా, మాటకి మాటకి సంబంధం  లేకుండా? ఇంకో సినిమా తీసినా, పాట రాసినా..' జాగ్రత్త! అంటూ సన్మానం చేసారు.
అయితే ఏంటి, కావలసినంత పేరు వొచ్చేసింది కదా, అని సరిపెట్టుకున్నాడు పెద్దాయన.

60 ప్యాక్


60 ప్యాక్
మహిళలారా, అతివలారా కదలి రండి, తర తరాలుగా ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటిద్దాం. మగవాళ్ళకి ఆరు కండలట. ఆరోగ్య మయిన తిండి తిని, కండలు పెంచి,  సుఖంగా తిరుగుతున్నారు. ఆడవాళ్లకు మాత్రం సున్నా సైజు అట. కత్తికి కాస్త కండ ... కూడా లేకుండా, ఎండిపోయి, కదలాడే అస్తిపంజరల్లా తయారయ్యి, ఆరోగ్యం చెడి,  ఆసుపత్రుల చుట్టూ తిరగాలట.చూసారా ఈ దారుణం?

 ఏంటండి, ఎర్ర జండా పట్టుకు వచ్చేద్దామని చూస్తున్నారా ? నా రచనలు మిమ్మల్ని నవ్వించడానికి, ఊరించడానికి, అలరించడానికి. మీ రోజువారి ఒత్తిడి నుంచి తేరుకుని మిమ్మల్ని మరిపించడానికి. నా భావ ప్రపంచంలో మిమ్మల్ని
విహరింప చెయ్యడానికి . సమాజాన్ని ఒక్క రోజులో మార్చేయ్యడానికి కాదు. కాని ఏ  మార్పయినా వ్యక్తుల నుంచే మొదలవుతుంది. నా భావాలు ఏ ఒక్క వ్యక్తి అయినా,  ఆత్మావలోకనం చేసుకుని మంచి మార్పుకు దోహదపడితే అంతే చాలు.
 
ఇక విషయానికి వస్తే, జనాల్లో అవయవ సౌష్టవం మీద పెరిగిన మోజు ను చూసి, '60  ప్యాక్' అనే పేరిట ఒక సంస్త వెలసింది. కింద కాప్షన్ '6 రోజుల్లో సిక్స్  ప్యాక్, 60 రోజుల్లో జీరో సైజు.' ఈ సంస్త అనూహ్యమయిన విజయాన్ని సాధించి, నగరం నిండా అరవై బ్రాంచ్ లు స్థాపించిన సందర్భంగా 'గుండె గుట్టు ' కార్యక్రమంలో ఇలా
అడుగుతున్నారు.

 'మీ సంస్థ ఇంత ఆదరణ పొందడానికి కారణం?'
'జనాల్లో వేలం వెర్రి లా పెరిగిపోయిన తృష్ణ. కండలు చూసి కళ్యాణాలు  జరుగుతున్నాయి. అందం చూసి అవకాశాలు దొరుకుతున్నాయి. ఆ కాపురాలు, అవకాశాల  ఎన్నాళ్ళు నిలబడతాయన్నది పక్కన పెడితే, మా కడుపు నిండుతోంది. పది మందికి ఉపాధి దొరుకుతోంది.'
'కండలు పెరగడానికి, కరిగించడానికి ప్రత్యేకమయిన పద్ధతులు ఉపయోగిస్తారట, కొంచం విడమరిచి చెప్తారా?'
'మగ వాళ్ళకి ముందుగా పొట్టలో గొట్టాలు పెట్టి కొవ్వు పొర( fat layer )అంతా  లాగేస్తాం. తరువాత, ఎక్కడ కండలు కావాలో, అక్కడ కాస్త మత్తిచ్చి, కవర్లో గండు  చీమల్ని పెట్టి కట్టేస్తాం. అలా ఆరు రోజులు తిరిగేసరికి వాళ్ళు కండలు పట్టి,  కావలసినవి సాధించుకుంటున్నారు.'
'ఆడవాళ్ళకి మా దగ్గర కుంకుడుకాయలు, కాకర కాయలు, కరక్కాయలు మొదలయిన మూలికలతో  కూడిన సాంబార్ తయారు చేస్తాం. ఇంక వాళ్ళు అరిచి గగ్గోలు పెట్టినా, అన్నిటిలోకి అదే మిశ్రమం పెడతాం. వాళ్ళకి తిండంటే విరక్తి పుట్టి తినడం మానేస్తారు. ఇంకా  వ్యాయామం కోసం వాళ్ళ వెనుక కుక్కలని వదులుతాం. అప్పుడు ఎంత పెంకి ఘటాలయినా  చచ్చినట్టు పరిగెత్తాల్సిందే.'
'మరి కుక్కలు కరిస్తేనో?'
'మొరిగే కుక్కలు కరవవండి. వినలేదా. అయినా ముందు జాగ్రత్త కోసం కుక్కల పళ్లన్నీ అరగదీసేస్తాం. ఈ సంగతి తెలియక వాళ్ళు పరిగెడుతుంటే చూడాలి, హ, హ్హ, హ్హ భలే  వినోదంగా ఉంటుంది. డబ్బిచ్చి దొరికిపోయారు గొర్రెలని. చివరికి అరవై రోజులు  గడిచేసరికి కల్పనా రాయి లాంటి ఆడవాళ్లయినా, బక్క చిక్కిన ఐశ్వర్య రాయి లాగ
తయారవుతారు.'
'మీ పురోగతి ఎంతకాలం సాగుతున్దంటారు?'
'మానసిక సౌందర్యం కన్నా, ప్రతిభ పాటవాల కన్నా, డబ్బు, బాహ్య సౌందర్యమే  ముఖ్యమనుకునే మూర్ఖులు ఉన్నంత కాలం మాకు వచ్చిన కొదవ ఏమి లేదు. ఆరోగ్యం  కన్నా,అందం శాశ్వతం అనుకునే వెర్రి వాళ్ళు ఉన్నంతకాలం మా '60 ప్యాక్' సంస్థ  మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది
.

Friday, April 27, 2012

సీరియల్స్


సీరియల్స్
సీరియల్ పిచ్చి ముదిరిపోయిన ఒకావిడ తపస్సు చేసి, 'సీరియల్ మాత' ను ప్రసన్నం  చేసుకుంది.  'మాతా ఇన్నాళ్ళకి నీ దర్సనం లభించింది. సీత, సావిత్రి, పిన్ని, దేవత, ... రుతురాగాలు, చంద్రముఖి, మొగలి రేకులు, రాధా మధు, అమృతం, విషకన్య, నాగ దేవత,  చిదంబర రహస్యం, గుప్పెడు మనసు ...........,' ఎన్ని రూపాలమ్మ నీకు? నిన్ను  పొగడాలంటే ఒక రోజు మొత్తం కావాలి.
 

'ఇంతకీ ఏమి కోరి తపస్సు చేసావు?'
'ఈ సీరియల్స్ ఎలా పుట్టాయో చెప్తావా తల్లి ?'
'అమ్మలక్కల కరువు వల్ల. పూర్వం సూరమ్మత్త , సుబ్బమ్మ పిన్ని, వెంకమ్మ బామ్మా,  పక్కింటి పంకజం, పంచదార, చింతపండు అరువు కోసం అంటూ వచ్చి , రోజంతా ఉప్పర  మీటింగులు పెట్టుకుని, ఉన్నవి, లేనివి చెప్పుకుంటూ ఉంటే, కొన్ని మాటలు,  తూటాలయ్యి గొడవలు పెట్టేవి. కొన్ని విమర్సలయ్యి, వాళ్ళని వాళ్ళు మెరుగు
పరచుకోవడానికి ఉపయోగపడేవి. కొన్ని చూసే వాళ్ళకి కన్నుల పండుగగా వినోదాన్ని  ఇచ్చేవి. మరి ఇప్పుడు వాళ్ళ మనవరాళ్ళు, మునిమనవరాళ్ళు అంతా చదువుకుని, వెంటనే  ఉద్యోగాల్లో చేరిపోతున్నారు కదా. మరి పల్లెల్లో కూడా వీధి అరుగుల మీద  అమ్మలక్కల సంక్షోభం వొచ్చింది. సాయంకాలం అయ్యేసరికి జనాలకి వినోదం ఎలా అన్న  ఆలోచన నుంచి సీరియల్స్ పుట్టాయి.'

'పుట్టాయి సరేనమ్మా, మరి వాటిల్లో టైటిల్ సాంగ్ లో తప్ప మరెక్కడా, ఆనందం  కనిపించకపోయినా, కక్షలు, కుట్రలు, కిడ్నాప్ లు, చంపడాలు, హత్యలు, హత్య  జరిగినవాళ్ళ దయ్యాలు, ఆత్మలు, మారిపోయే తలకాయలు, పాత్రలు, అర్ధం పర్ధం లేని  సన్నివేశాలు, ఇంతెందుకు, జనాలని ఎంత హింసించినా కిక్కురు మనకుండా
చూస్తున్నారే, ఇందులో కిటుకేమిటమ్మ?'
'గడ్డ పెరుగు కొట్లలో అమ్మడం వల్ల.'
'గడ్డ పేరుగా........?'
'మరే, ఇది వరకు ఊరు వెళ్లోచ్చినా, పెరుగు సరిగ్గా తోడుకోక పోయినా, తప్పని  సరిగా పక్కింటికో, ఎదురింటికో వెళ్లి తెచ్చుకునే వాళ్ళు. ఇప్పుడు పెరుగు  అమ్మకాల వల్ల, ఆ అవసరం కూడా తప్పిపోయింది. ఇంటికి- ఇంటికి, మనిషికి-మనిషికి  బోలెడంత దూరం. అంతెందుకు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఎంతమంది నీకు తెలుసు? ఇలాంటి  మానవ సంభందాలు ఉన్నంతవరకు ఇడియట్ బాక్స్ కు వొచ్చిన చిక్కేమి లేదు. పెద్దలు  సీరియల్స్, యువత ఇంటర్నెట్, పిల్లలు కార్టూన్స్, ఇంట్లో వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు  మాట్లాడుకునేదే తక్కువ. కాబట్టి పక్కింట్లో పిడుగులు పడ్డా, స్లో పాయిసన్ లాగ  సీరియల్స్ అలవాటు పడ్డ జనం నిమ్మకు నీరెత్తినట్టు మనకెందుకులే అని, t .వ  చూస్తున్నారు.'
 

'అయితే సీరియల్స్ మీద బ్రతికే వాళ్ళకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉందంటావు. వాళ్ళ  జీవితం మూడు సీరియల్స్, ఆరు స్పెషల్ ప్రోగ్రామ్స్ గా ఉంటుందంటావు. తల్లి, నేను  కూడా ఏదన్నా సీరియల్ లో తిరుగు లేని తారగా వెలిగి, ఎపిసోడ్ కు లక్ష విరాళం  పుచ్చుకునే లా దీవించమ్మ. అంతే కాక నా వంశం వారంతా సీరియల్ నటినటులుగా చిరకాలం  వర్ధిల్లేలా దీవించమ్మ.'
 

'satellite లు పేలిపోయేవరకు సీరియల్స్ లో వేషాలతో వర్ధిల్లండి. తధాస్తు.

పోటీ


పోటీ
'జీవితమే ఒక పరుగు పందెం.గెలవడానికి పోటీ పడాలి.'

 'పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే నిరంతర కృషి అవసరం.'

 "Struggle for the existence and survival & the fittest" అని చార్లెస్ ... డార్విన్ పేర్కొన్నట్లు ప్రస్తుతం ప్రపంచం అంతా పోటీ మయమయిపోయింది. పుట్టగానే  'వెల్ బేబీ కాంటెస్ట్' తో మొదలవుతున్నాయి తిప్పలు. తరువాత స్కూల్ సీట్ల కోసం  పోటీలు, మార్కుల కోసం పోటీలు, వేషధారణ పోటీలు, నాట్య పోటీలు, సంగీత పోటీలు,
చిత్ర లేఖన పోటీలు మొదలయినవి పిల్లలకు సవాళ్ళు. తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా  అన్ని రంగాల్లోనూ రాణించాలని, పిల్లలు ఎంత నలిగిపోతున్నారో, మనం t.v లలో  చూస్తున్నాం. ఒక్కసారి పిల్లలకు పేరు ప్రఖ్యాతులు రాగానే రక రకాల ప్రదర్శనలకు  వాళ్ళను సిద్ధం చేస్తారు. తలకు మించిన భారంతో, వాళ్ళ బాల్యం

ఛిద్రమయిపోతుంది. అదేమంటే, పోటి అని సరిపెట్టుకుంటాం.
 

ఇంటర్ విద్యార్ధులని చూస్తె, బావిలోని కప్పల్లా అనిపిస్తారు. పుస్తకాలు తప్ప బయటి ప్రపంచం తెలియకుండా కళాశాల వాళ్ళు నలిపెస్తారు.శక్తికి మించి చదవలేక ...  తల్లిదండ్రులతో తమ నిస్సహాయతను సరిగ్గా చెప్పుకోలేక ..చెప్పినా వారు అర్ధం  చేసుకోలేక మానసికంగా నలిగిపోతున్న పిల్లలు ఎందరో ఉన్నారు. పెద్దలు మరొకరితో  పోల్చి వాళ్ళను కించపరుస్తూ ఉంటారు. ఎవరి మేధ వారిది, ఎవరి ప్రజ్ఞ వారిది.  పక్క వారికి రెండు మార్కులు ఎక్కువ వొస్తే, జాతీయ విపత్తు కలిగినట్టు ఇంట్లో  పరిస్థితి.
 

హాయిగా ఇంటి పట్టున ఉండే ఇల్లాలిని కూడా పోటీలు వదలవు. వంటల పోటీలు, ముగ్గుల  పోటీలు,మేటి మహిళా పోటీలు ఎన్నో. వాళ్ళ మొహాన బొట్టు బిళ్ళలు అంటించి, జడలలో  straw లు కూరి, ముక్కుతో బెలూన్ పగలగొట్టించి, నానా విన్యాసాలు చేయిస్తారు.  అతివల వెతలు ఇలా ఉంటే, ఇంట్లో పెంపుడు జంతువులని సయితం వదలదు ఈ పోటీ. కుక్కల  పోటీలు, గిత్తల పోటీలు, పిల్లుల పోటీలు, పెంపుడు జంతువుల పోటీలు అంటూ, వాటి
మానస సరోవరాల్లోనూ కల్లోలం రేపుతారు. అవి గెలవక పొతే, వాటికి అర్ధం కాకపోయినా నిరసన ప్రకటించి,  క్లాస్స్లు పీకుతారు.

ఇక మగవారికి కుస్తీ పోటీలు, క్రికెట్ పోటీలు,  శరీర సౌష్టవ పోటీలు, కబడ్డీ పోటీలు, కొన్ని సార్లు వంటల పోటీలు పెడుతుంటారు.  ఇంట్లో వంటలు చేసే మగవాళ్ళందరూ అలా దొరికిపోతారన్న మాట.
 

ఇవన్నీ చూస్తుంటే, జీవితం యుద్ధరంగామా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. ప్రశాంతంగా  గడపడానికి ప్రకృతి ఇచ్చిన వరమే జీవితం. నిత్యం మన తెలివికి పదును పెట్టుకుంటూ,  విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, ఆరోగ్యకరంగా పోటీ పడాలి. ఒకరికొకరు  సామరస్యంగా, సహకారంగా, సానుకూలంగా బతకాలి. అప్పుడే స్నేహభావం పెరిగి,  జీవితంలోని మాధుర్యం అవగతమవుతుంది. 

పగ



పగ

పని మీద స్నేహితురాలి ఇంటికి వెళ్ళానoడి. వాళ్ళింట్లో మెగా సూపర్ హిట్ సీరియల్  చూస్తున్నారు. కూర్చో, బ్రేక్లో మాట్లాడతా, అంది  'పగ, పగ పగ, నా ముప్పై ఏళ్ళ నాటి పగ. గుండెల్లో రగులుతున్న పగ. ఇన్నేళ్ళకి ... దొరికాడు ఆ పరాంకుశం గాడు. 'అంటూ, వికటాట్టహాసం చేస్తున్నాడు.

 ఈ లోపల ఒక స్త్రీ పాత్ర వొచ్చింది. 'ఏంటి పరాంకుశం కనిపించాడా? దేవుడు  ఉన్నాడురా, నా పూజలు ఫలించాయి, వెంటనే వాడి రక్తం కళ్ళ జూడాలి.' అంటూ కాసేపు  నవ్వింది, కాసేపు ఏడిచింది, కాసేపు ఉద్వేగంగా తల బాదుకుంది, జుట్టు పీక్కుంది.
(చూస్తున్న నాకు పిచ్చెక్కుతోంది, రక్తం కళ్ళ జూడలా, ఉండు, accucheck నీడలే  తో వాడి వేలు పొడిచి చూపిస్తా, అనుకున్నాను మనసులో)
ఇంతలో పుత్ర రత్నం వొచ్చాడు,' బామ్మా, ఎందుకె అంత పగ?' 'వాడికి ఐదేళ్ళు  ఉన్నప్పుడు నా చీర పట్టుకున్నడురా! అంటే, ఆరేసిన చీర గాలికి ఎగిరిపోతే  పట్టుకోచ్చడురా, అంది పళ్ళు నూరుతూ' , ఈ లోపల నాన్న పాత్ర అందుకుంది. 'అంతే  కాదురా వాడు చిన్నప్పుడు నా బలపం తినేసాడురా, అన్నాడు పిడికిలి బిగిస్తూ'
(ఒరే బాబు, నీకో బలపాల ప్యాకెట్ కొనిస్తాను, క్షమించేయ్యరా, అనుకున్నాను  మనసులో)
'ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు నాన్న, వాడి అంతు చూసే దాకా నేను స్నానం  చెయ్యను', అన్నాడు పుత్ర రత్నం emotion క్యారీ చేస్తూ.
(స్నానం చెయ్యకపోతే, కంపు కొట్టి చస్తావురా, చవటాయ్, అనుకున్నాను మనసులో)

 ప్రేక్షకులు మంత్ర ముగ్దుల్లా చూస్తున్నారు. నాకు పారిపోవాలని అనిపించింది.  అవసర సమయాల్లో నా బుర్ర పాదరసం లాగ పని చేస్తుంది. ఫోన్ లో fake కాల్ అచ్తివాతే  చేసి, హలో, అంటూ బయటపడ్డాను.

మనసులో ఆలోచనలు, అసలు ఈ సీరియల్స్ ఏమి చెప్పాలనుకుంటున్నాయి? మనుషుల్లో  క్రోధాన్ని, పగని, చెడు ద్రుక్పదాలని ప్రచారం చేస్తున్నాయి. సరే, మనం ఏమి  చేస్తున్నాం? ఎప్పటి సంగతులో సాగాదీసుకుంటూ వాళ్ళని, వీళ్ళని విమర్శిస్తూ  జీవితాలు గడిపెస్తున్నాం. తరం నుంచి తరం అంతరాలు పెంచుకుంటున్నాం. ఈ పగలతో,  పంతాలతో, ఆశయాలతో మనం ఏమి సాధించాం? క్షమించడంలో దైవత్వం ఉంది, ద్వేషించడంలో
దానవత్వం ఉంది.

 మిత్రులారా, ఈ చిన్ని జీవితంలో, ఇన్ని ఉద్వేగాలు అవసరమా? మనసులో కూడా ఎవరిని  ద్వేషించాకండి .అంతర్లీనంగా, చిన్న సైజు factionist ల లాగ మీరు మోస్తున్న  పగలు, ద్వేషాలు వీడండి.  సంతోషంగా  నవ్వుతూ, నవ్విస్తూ ఉండండి. సీరియల్స్ బదులు మంచి సంగీతం వినండి, మిత్రులతో  మాట్లాడండి, మంచి సాహిత్యం చదవండి. ప్రతి రోజు మనిషికి పునర్జన్మ. ఏ మనిషి  పూర్తిగా మంచివాడు కాదు, పూర్తిగా చెడ్డవాడు కాదు. నా వరకు నేను ప్రతి వారి  నుంచి నేర్చుకోవలసిన సుగుణం ఒక్కటయినా ఉంటుందని నమ్ముతాను. ఆ నేర్చుకున్న  విషయాన్నీ పదిల పరచుకుంటాను. అప్పుడే వ్యక్తి మానసికంగా ఎదిగేది.

పారోడి


పారోడి
పారోడి లేక అనుకరణ. ఈ అనుకరణ అనేది మనకు చిన్నప్పటి నుంచే అలవాటు అయిపోతుంది.  పిల్లలు పెద్దల్ని అనుకరిస్తారు. పెద్దలు ప్రముఖుల్ని అనుకరిస్తారు. అనుకరణ  కూడా ఒక కళ. ఏ కొత్త గారడీ చెయ్యలేకపోతే , పారోడి నే దిక్కట మరి. 'కొలవెర్రి' ... ఎన్ని భాషల్లో వెర్రి తలలు వేసిందో మనం చూసాం కదా.
 

ఒకప్పుడు బొంగురు గొంతు ఉన్న వాళ్ళు పాట పాడడానికి, సంగీతం నేర్చుకోవడానికి,  భయపడే వాళ్ళు. నాకు బాగా గుర్తు,'బామ్మా, ఒక పాట పాడవా?', అని అడిగితే,  'చిన్నప్పుడు, నీ బారసాలకి పాట పాడితే, గాడిద వొచ్చిందే, నా గొంతుకి. అనవసరంగా  గాడిదలని కలవర పెట్టడం ఎందుకు చెప్పు?' అనేది. మరి ఇప్పుడో, బొంగురు గొంతు
వెరైటీ, ముక్కుతో పాడితే వెరైటీ.


 Remix రాజు గారిని పట్టుకుని , 'అసలు ఈ రిమిక్ష్ అనే ఆలోచన ఎలా  పుట్టినదంటారు?' అని అడిగితే, 'మరేమీ లేదండి, చిన్నప్పుడు మా ఇంట్లో రికార్డు  అరిగిపోయినప్పుడు, సాగదీసినట్టు, బొంగురు పోయినట్టు వినిపించేవి. ఇదొక ప్రేరణ.  మా తమ్ముడికి నత్తి ఉంది. వాడు నెత్తిన ఒక్కటి కొట్టే దాకా 'దంచవే మేనత్త  కూతురా పాటని, ద .ద దన్ ..అని పాడుతుంటే వెరైటీ గా అనిపించింది. మరి ఇంకో  చెల్లెలికి షార్ట్ టర్మ్ మెమరీ లాస్. పాట చేతికి ఇచ్చేదాక, అదే పల్లవి పాడుతూ  ఉండేది. మా మేనల్లుడు ఉండుండి, నక్క ఊళ పెట్టినట్టు, చెయ్యి ఎవరో కరిచినట్టు, వింత కూతలు కూసేవాడు. ఇంక వీటన్నిటితో పాటు పిల్లలు గిన్నెల మీద చెంచాలు, గరిటలు వేసి కొడుతూ,వింత శబ్దాలు చేస్తుంటేను, కూతలు కూస్తుంటేను,ఆ కొలహలానికి చుట్టుపక్కల  అందరు పోగయ్యేవారు. అలా రెమిక్ష్ పుట్టింది.' అని కళ్ళు తెరిపించారు.

 సినిమా పాటకి, ఏదో సరదాగా మరో సాహిత్యం బట్టతల మీదో, కదలని ట్రైన్ల మీదో  రాస్తే పరవాలేదండి. మరి సినిమా పాటల బాణిలకి, భక్తి అంటగడతారు చూడండి, అక్కడే  తన్నేస్తుంది. అలా సినిమా ట్యూన్ లకి lyrics రాసి అచ్చయిన పుస్తకాలు కూడా  బోలెడన్ని దొరుకుతాయి మార్కెట్లో. 'పగలే వెన్నెల' పాటకి 'షిరిడి శ్రీపతి' అని
పాడితే, ఏదో జమున కళ్ళముందు piano వాయిస్తూ కనిపిస్తుంది కనుక పరవాలేదు.


 'అప్పటికింకా నా వయసు నిండా పదహారే ' పాటకు 'ఇప్పటికింకా నీ కరుణ నాపై కురవాలే' అని పాడితే, ఊహించుకోండి. మెదడులో ముమైత్ ఖాన్, పాడేది దేవుడి పాట.

 ఇలాంటి పాటలని మించిన శిక్ష లేదు దేవుడికి, భక్తులకి. 

ఉగాది




ఉగాది
హమ్మయ్య,
అయిపోయిన్దాండి పండగ హడావిడి? పొద్దుట నుంచి తోరణాలు కట్టి, ముగ్గులు పెట్టి,  పిల్లల్ని లేపి చావగొట్టి, తలంటి, పూజలు చేపట్టి, ఉగాది పచ్చడి కలియబెట్టి, ...
పారిపోతున్నా సరే, అందరికీ తినిపించేసారు కదా. ఆంధ్రులకు ఆరంభాసూరత్వం ఎక్కువ  కదండీ. అయినా ఇంతటితో ఆగిపోతామా?

సమరోత్సాహంతో వంటింటిలోకి దూకి, రకరకాల వంటలు  చమటోడ్చి వండేసి, డైనింగ్ టేబుల్ నిమ్పేస్తాం. సాయంత్రానికి అవన్నీ ఎలా ఖర్చు  పెట్టాలో తెలియక, వంటలే, బెంగలయి పోతాయి. మరి  తరువాత కొన్నిటిని పొట్టలోకి ,  కొన్నిటిని చల్లని తల్లి వొడి, అదే నండి, ఫ్రిజ్ లోకి తోసేసి, చింత  తీర్చుకుంటాం. పండగ మర్నాడు వంట చేసుకోవక్కర్లేదన్దోయ్, కదా.

కొత్త ఆశలు, ఆలోచనలు, చిగురించి, సంతోషాలు వెల్లివిరిసి, జీవితంలో వెలుగులు  నిండాలని కోరుకునే సంవత్సరాది ఉగాది. నందనం ఆనందాన్ని కలిగించే సంవత్సరం.  అందరికీ శుభదాయకం . భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి సహజమే. అందుకే అందరు  పంచాంగ శ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా రైతులు వర్షాల, దేశ కాల  పరిస్తితుల కోసం పంచాంగం వింటారు. అన్ని బాగానే ఉంటాయి.

ఈ రాశి ఫలాలు ఉన్నాయి  చూసారు, దానిల్లు బంగారం కాను. వింటేనే నీరసం వొచ్చేస్తుంది నాకు. నా  చిన్నప్పటి నుంచి వింటున్నాను. అనుకూలంగా ఒక్కసారి చెప్పరు. మొత్తానికి బుధుడి  మీద, శుక్రుడి మీద పెట్టేసి నిరాశా జనకంగా చెప్తారు. విన్న నాకు మీతో కొన్ని  మాటలు చెప్పాలని అనిపించింది.

జీవితంలో సంతోషాలు తీయగా పలకరిస్తాయి. అనుకోని సంఘటనలు చేదుగా నిలిచిపోతాయి.  ఉప్పని ఉద్వేగాలు, కమ్మటి మమతలు, కారంగా కోపాలు, పుల్లటి చిరు జ్ఞాపకాలు,అన్నిటి సమ్మేళనమే జీవితం. కాల ప్రవాహంలో సుఖ దుఖాలు కుడా తరంగాలే.  కష్టాలను తట్టుకుని సాగిపోయే ధైర్యం ఉండాలి. మంచి సంకల్పం, మంచి ఆలోచన, వాటిని  అమలు చేసే ఆచరణ, తప్పక సత్ఫలితాలను ఇస్తాయనేది వేద వాక్యం.

 'చిత్తంలో శివుడిని(భగవంతుడిని) పెట్టుకున్న వానికి గ్రహాలన్నీ అనుకూలాలే.
తిది వార నక్షత్రాలు అన్ని అనుకూలాలే. యోగాలన్ని యోగ్యమయినవే.'
అందుకే, అనవసరమయిన ఉద్వేగాలకు లోను కాకుండా, ప్రశాంతంగా ఉండండి. ఈ వసంత మాసంలా , మీ జీవితం నందనమవుతుంది.