Sunday, January 20, 2013

భాషలో యాస

నిన్న కూరలు కావలసి ఎదురుగుండా ఉన్న కూరల కొట్టుకు వెళ్ళాను. అక్కడ చిన్నపాటి
సభ జరుగుతోంది. ' హబ్బ, ఎంత ఆలోచించినా, బుర్రలో పేరు ఆడుతోంది, నోట్లో
నానుతోంది, కాని గుర్తుకురావట్లేదు. మీకు తెలుసా,' అంటూ వచ్చే పోయే వాళ్ళు
అందరినీ అడుగుతున్నాడు. ఇంతలో, 'ఆ కాయల పేరేమిటన్నావ్..?' అడిగాడు కూరలమ్మే
అబ్బాయిని. 'చంపుతున్నాడు, ఇప్పటికి పది సార్లు అడిగాడు, ' అని విసుక్కుంటూ,
'కలిమి కాయలు సర్', అన్నాడు. నాకూ సందేహం వచ్చేసింది, 'అవేంటి, ఎక్కడా
వినలేదే, శ్రావణ మాసం ప్రత్యెక కూరలా..' అడిగాను. 'కాదండి, ఆకుపచ్చగా,
గుండ్రంగా, పుల్లగా ఉంటాయి...పచ్చడి కూడా పెడతారు..ఈ కాలం
వస్తాయి...'అంటుండగా...'వాక్కాయలా?' అడిగాను. వెంటనే పెద్దాయన ఉత్సాహంగా
పరిగెత్తుకు వచ్చి, 'గొప్ప ఉపకారం చేసావు తల్లి, అరగంట నుంచి బుర్ర
పగిలిపోతోంది, ఏవండోయ్ విన్నారా...వాక్కయాలట , ఈ అమ్మాయి చెబుతోంది...'అంటూ
నాకు ఉచిత ప్రచారం కల్పించాడు. కూరల వాడు నన్ను మెచ్చుకోలుగా చూసి, ఒక ఐదు
రూపాయిలు తగ్గించాడు.

భాష ఒక్కటే అయినా ప్రాంతీయ భేదాల వల్ల ఎన్ని తిప్పలో అనుకున్నాను నేను.
హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో నేను పడ్డ ఇబ్బందులు గుర్తొచ్చాయి. ఒక సారి ఎవరినో
అడ్రస్ అడిగితే, 'చక్కా పో!' అన్నాడు. చక్కగానే కదా వెళుతున్నాను,
అనుకుంటూ...అంటే కుడి వైపా, ఎడమ వైపా? అడిగాను నేను...అరె, సమ్ఝైతల్లె, సీదా
పోవాలె, చెప్పాడు సాత్వికంగా. మరో సారి, ఇంట్లో బీరువా జరపాల్సి వచ్చింది. పని
మనిషిని పిలిచాను. కాసేపటికి వచ్చి, 'బీరువా దొబ్బెయ్యనా?' అంది. నేను
నివ్వెరపోయాను, మా వైపు దొబ్బడం అంటే, దొంగతనం చెయ్యడం అని. ఇక్కడ దొబ్బడం
అంటే, నెట్టడం అన్న అర్ధమట. ఇక్కడి కూరల పేర్లు కూడా నాకు ఏంటో విచిత్రంగా
అనిపించేవి. గోరుచిక్కుడు కాయను---గోకర కాయ అంటారు. ఆలుగడ్డ, కొత్మీర్,
బీనిస్, ఉల్లిగడ్డ, చేమ గడ్డ...ఇలా ఎన్ని రకాలో. ఒక సారి నూతన సంవత్సర
వేడుకల్లో నన్ను పాట పాడమన్నారు. పాడి స్టేజి దిగంగానే, ఒకావిడ నా చేతులు
పట్టుకుని, 'మస్తు పాడినావ్ లే, నాకయితే వంటి మీద ముళ్ళు లేచినయ్..' అంది.
అంటే తిట్టినట్టా ...పొగిడినట్టా? అర్ధం కాలేదు నాకు. తర్వాత కనుక్కుంటే, నా
పాటకి ఆవిడకి వంటి మీద రోమాలు నిక్కబొడుచుకున్నాయట . అంటే, పాట నచ్చినట్టే
కదా, హమ్మయ్య అనుకున్నాను.



బెంగళూరు లో మేమున్నప్పుడు, మా ఇంటివాళ్ళు ఎప్పుడో అక్కడ స్థిరపడిపోయిన తెలుగు
వాళ్ళు. ఆవిడ కన్నడం తెలుగులో, అమెరికన్ ఇంగ్లీష్ యాస కలిపి మాట్లాడుతుంటే,
స్వర్గం కనిపించేదంటే, నమ్మండి. 'రండా !' అనగానే, ఏదో తిట్టినట్టు అనిపించేది.
'తిండి అయ్యిందా?' అంటే, 'తిండిబోతా!' అని వెక్కిరించినట్టు ఉండేది. అక్కడ
తిండి అంటే--టిఫిన్ అని అర్ధం. ఒక సారి మా ఇంటికి వచ్చి, 'దుడ్లు ఎత్తుకు
పోదామని వచ్చుండాను...' అంది. అంటే, అద్దె తీసుకు వెళ్ళడానికి వచ్చిందన్న మాట.
తెలుగులో వాడుకలో లేని క్లిష్ట పదాలు ఇంకా కన్నడిగులు వాడుతుంటారు. సోంబేరి,
సొల్లు, కిరికిరి., తొందర (వాళ్ళ అర్ధం కంగారు), బేజారు ..ఇలా చాలా ఉన్నాయి.
మన తెలుగు ,వాళ్ళ కన్నడంలో కలిసి, రూపాంతరం చెంది, అదో రకం కొత్త భాషలా
ఉంటుంది. 'మేమూ తెలుగొండ్లమే...' అని ఎవరన్న అంటే, నాకు వెంటనే పారిపోవాలి
అనిపించేది. 'ఆండా పిల్ల కాయలు బాగుంది ...' అంటే, ఆడపిల్లలే మేలు అని
చెప్పడం అన్నమాట. ఒక సారి మా స్నేహితురాలు ఒకావిడ ఊరు వెళుతోంది. నేను
ఊరుకోవచ్చుగా, 'ఎవరెవరు వేలుతున్నారండి?' అని అడిగాను. 'మనము, మన పిల్లలు, మన
మొగుడు...' అనగానే ఘోల్లున నవ్వేసాను. ఆవిడ అవాక్కయ్యింది. అంటే, అర్ధం తరువాత
వివరించాను.

ఇవండీ, భాషా తిప్పలు. అయినా, తెలుగులో మాట్లాడాలి, రాయాలి అన్న ఉత్సాహాన్ని
ప్రోత్సహించాలి కదండీ. కాకపొతే, చిన్నప్పటి తెలుగు మాష్టారులు చెవి మెలిపెట్టి
మరీ నేర్పిన భాష, అలా చీల్చి చెండాడుతుంటే, ఎక్కడో చిన్న వెలితి. తెలుగు భాషకు
ప్రాచీన హోదా కల్పించి, పురావస్తు శాఖ వాళ్ళ తవ్వకాల్లో మాత్రమే బయట పడేటట్టు
కాకుండా, కనీసం ఇలాగాయినా, విని, చదివి కాస్త హింసను భరించయినా,
పరిరక్షించుకుందాం. ఏమంటారు?

1 comment:

  1. అవును మన తెలుగు భాషని మనమే ప్రోత్సహించాలి ...తప్పకుండా పరిరక్షించు కుందాము........

    ReplyDelete