Thursday, January 17, 2013

ఆరు టోపీల ఆలోచనలు







ఆరు టోపీల ఆలోచనలు


శర్మ పెదనాన్న గారు 'ఎడ్వర్డ్ డిబోనో' అనే శాస్త్రజ్ఞుడి ఆరు టోపీల ఆలోచనలు(Six Hat Thinking ) గురించి చెప్పగానే, ఆ టోపీల మహిమ ఎలా ఉంటుందో చూడాలనిపించింది. కాని, ఆ శాస్త్రజ్ఞుడు ఎవరో కనిపెట్టి, బోలెడు డబ్బులు పెట్టి టోపీలు కొని తేవడం కష్టం కనుక , నేనే తెలుపు, ఎరుపు, నలుపు,పసుపు, ఆకుపచ్చ, నీలం టోపీలు కొని తెచ్చుకున్నాను. మరి టోపీలలోకి  మహిమ ఎలా వస్తుంది ? ఆవాహన చేస్తే పోలా! అనిపించింది. వెంటనే, అన్ని టోపీలను వరుసగా పేర్చి, క్రింది మంత్రాన్ని చదివాను.

' ప్రధమే తెల్ల టోపీ అంతరే , బోడిగుండాకార మండలే శాంతకవితాకన్యకాం ఆవాహయామి, స్థాపయామి పూజయామి. తెల్ల టోపీ ఉత్తర దిగ్భాగే,టమాటో ఆకార  మండలే విప్లవకవితాకన్యకాం యెర్ర టోపీ అంతరే ఆవాహయామి , స్థాపయామి పూజయామి. యెర్ర టోపీ ఈశాన్య దిగ్భాగే క్రికెట్ బాల్ ఆకార మండలే నిరసనకవితాకన్యకాం నల్ల టోపీ అంటారే ఆవాహయామి, స్థాపయామి పూజయామి ...ఇలా.... పొగడ్తకవితాకన్యక (పసుపు టోపీ) , హరితకవితాకన్యక (పచ్చదనం- పరిశుబ్రత--ఆకుపచ్చ టోపీ), వెదాన్తకవితాకన్యక( నీలం టోపీ) లో ఆవాహన చేసి, పటిక బెల్లం నివేదించాను. మండపే స్థిత సర్వదేవతాభ్యాం సుప్రీతా సుప్రసన్నా, వరదా భవతు. మమ ఇష్ట కామ్యార్ధ సిద్ధిరస్తు! ' అనుకుని రంగం లోకి దిగాను.

ఇప్పుడు నాకొక సమస్య కావాలి. మా వంటింటి అలమారాలో రాత్రి వేళ ఒక ఎలుక దూరుతుంది. అది నేను నిద్రపోతున్నప్పుడు, నెమ్మదిగా, ఎక్శాస్ట్ ఫ్యాన్ కన్నం లోంచి చల్లగా వచ్చి, దురాక్రమణ చేస్తుంది. ముందుగా ఏ మందునయినా ఇలా ఎలుకల మీద ప్రయోగించడం మామూలే కదా! అందుకే, నా పని, దానితోటే  మొదలుపెట్టా !

ముందుగా తెల్ల టోపీ ధరించి, ఎలుక ఉన్న అలమారు ముందు కూర్చుని, ' చూడమ్మా, ఎలుకా! శాంతము లేక సౌఖ్యము లేదు, కనుక నువ్వు మా ఇల్లు వదిలి తక్కిన 104 ఫ్లాట్స్ లో ఏదో ఒక దానికి వెళ్ళిపో. మనం ప్రశాంతంగా ఉంటె చాలు, మిగతా వాళ్ళు గింజుకున్నా సరే, ఇదే సగటు భారతీయుడి సిద్ధాంతం...' అని శాంతంగా చెప్పాను.

తరువాత యెర్ర టోపీ పెట్టుకుని, ' విప్లవం, వర్ధిల్లాలి! తర తరాలుగా మీ ఎలక జాతి మా ఇల్లాళ్ళను, గోడౌన్ లను దురాక్రమణ చేసి హింసిస్తున్నారు. మర్యాదగా వెళ్ళకపోతే, పైడ్ పైపర్ ను పిలిచెద ...' అని బెదిరించాను.

ఇక నల్ల టోపీ వంతు. ' ఓసీ! ఎలుకరాజమా ! నీకునూ నేను లోకువయితినా! నీ ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నాను. తక్షణమే మదీయ గృహము వదిలి పోనిఎడల ఇచ్చోటనే ఆమరణ కవితా దీక్ష పూని, నీపై  ఘడియకో కవిత చెప్పి హింసించెద ! ' అంటూ ఒక వికటాట్ట హాసం చేసాను. ఎలుక కదిలిన చప్పుడు. హమ్మయ్య, టోపీలు పని చేస్తున్నాయి. ఎలుక నుంచీ సంకేతాలు వస్తున్నాయి.

ఉత్సాహంతో పసుపు టోపీ అందుకున్నాను. లోకమందు పొగడ్తకు పడని  ప్రాణి లేదు కదా! ' ఎలుకా! చిన్న జీవివయినా గణేశుడి వాహనమయితివి. పిల్లికి ఆహారమయి, దాని కడుపు నింపు చుంటివి. ప్రయోగాములకు నీవే ప్రాణము. నీవు ఇంటిలో కంటే, పక్కింటిలో ఉంటె భలే అందముగా ఉందువు. కనుక అచ్చటికే పొమ్ము...'అని విన్నవించితి.

తరువాత ఆకుపచ్చ టోపీ పెట్టుకుని, శుబ్రత- పరిశుబ్రత గురించి, క్లీన్ మరియు గ్రీన్ గురించి దానికొక క్లాసు పీకాను. ఇంక మిగిలిన నీలం టోపీ పెట్టుకుని, 'ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. నువ్వు, నేను అంతా  నశిస్తాము. అందుకే అశాశ్వతమయిన నీ దేహాన్ని నా ఇంటిలో చాలించక ఆత్మజ్ఞానం వృద్ధి చేసుకోడానికి, ఏ బాబా ల ఇంటికో వెళ్ళమ్మా !' అంటూదానికి  జ్ఞానోదయం చేసాను. 

ఇక ఆరు టోపీలను ఎలుక ఉన్న అలమారు ముందు పెట్టి, ఏదో ఒకటి ఎంచుకుని, ఈ సమస్యను పరిష్కరించమని చెప్పి, నిద్రపోయాను. తెల్లారి చూద్దును కదా! ఆరు టోపీలు కొట్టేసి, ఎలుక వెళ్ళిపోయింది. 

నీతి  : ఆలోచనా విధానములు మన కొరకే గాని ఎలుకలకు వర్తించవు. ఎలుకలను నమ్మరాదు. ...చేరి ఎలుకల మనసు రంజింపగారాదు!



 

2 comments:

  1. ధన్యవాదాలు మురళి గారు. మీకు అవకాశం ఉంటే, నా పేస్ బుక్ బృందాన్ని క్రింది లింక్ లో దర్శించగలరు.

    https://www.facebook.com/groups/acchamgatelugu/

    ReplyDelete