Friday, June 14, 2013

శక్తి పాతకం

                                                                              


శక్తి పాతకం 
-------------

పాతకులయిన నా ప్రియ మిత్రులారా! కలియుగమున మానవులు బలహీనులు, పాపాత్ములు. మరి ఇట్టి మానవులు బలాన్ని సంపాదించుకోవాలంటే ఏమి చెయ్యాలి ? బలానికి మాత్రలు, టానిక్కులు వాడితే లాభం లేదు. 'బూస్ట్ ఇస్ ద సీక్రెట్ అఫ్ మై ఎనర్జీ ...' అంటే కుదరదు. బూస్ట్ ఆ పూటకు మాత్రమే బలాన్ని ఇస్తుంది. ఒక నెలంతా మీకు అద్భుతమయిన శక్తినిచ్చే హెల్త్ డ్రింక్... శక్తి పానకం...కాదు...పాతకం...కాదు శక్తిపాతం. దీని గురించి నాకూ తెలీదు, ఆవిడని కలిసేదాకా...

ఐదేళ్ళ క్రితం ,ఆవిడ మా పోరుగింటావిడ. అమాయకత్వం, కొట్టొచ్చినట్టు మాట్లాడే తత్త్వం ఉన్న మనిషి. ఏదో, పని పడి, ఆవిడ ఇంటికి వెళ్లాను. ఆవిడ మహదానందంగా ఉంది. వాళ్ళింట్లో ఒక పెద్దాయన కూర్చుని ఉన్నారు. ' రా, పద్మిని, ఈయన మా గురువుగారు, శక్తి పాతం దీక్షలు ఇస్తారు. నేనిప్పుడే తీసుకున్నా, నువ్వూ తీసుకుంటే బాగుంటుంది,' అంది. నాకేం తెలుసు...అదేదో జీడిపప్పు పాకం లాంటిది అనుకున్నా...ఎంచక్కా, ఆయనకు నమస్కరించి, ఎదురుగుండా కూర్చుండిపోయా... ఆవిడ ఫక్కున నవ్వి, శక్తి పాతం తీసుకోవడం అంత సులభం అనుకున్నావా, అయ్యో తల్లి, దానికి నియమాలు ఉన్నాయి. నెల రోజుల పాటు ఏకభుక్తం, భూశయనం , బ్రహ్మచర్యం...ఇలా చెప్పుకుంటూ పోసాగింది. నేను శ్రద్ధగా వింటూ, 'ఆంటీ , ఈ శక్తి పానకం తాగడానికి ఇన్ని నియమాలా? అసలు ఇది ఎందుకు తీసుకోవాలి ?'. ఇందుకు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, గురువుగారు సెలవు తీసుకు వెళ్లారు.

ఆవిడ వెంటనే నా అజ్ఞానాన్ని తొలగించడానికి అవతరించిన లేడీ శ్రీకృష్ణుడిలా, ఇలా చెప్పింది... 'చూడమ్మాయ్... ప్రతీ మనిషికి శక్తి ఎక్కడ నుంచి వస్తుంది? పరమాత్మ నుంచీ... కాని దేవుడు మనకిచ్చిన శక్తి వయసు రీత్యా బలహీన పడుతుంది. ఇంకా తేలిగ్గా చెప్తా...ఇప్పుడు మన ఇంట్లో లైట్ ఎలా వెలుగుతుంది? స్విచ్ వేస్తె అనకు...కరెంటు ఆఫీస్ నుంచీ..వాళ్ళు కోత విధిస్తే, కరెంటు పోయి బుల్బ్ వెలగదు. అప్పుడు మనం చిన్న దీపం కాని, కాండిల్ కాని వెలిగించి , వెలుగు అరువు తెచ్చుకుంటాం....  అలాగే, మన వంట్లో భగవంతుడిచ్చిన శక్తి అయిపోతే, మళ్ళి విశ్వ శక్తి(పరమాత్మ) నుంచీ అరువు తెచ్చుకుని, బలపడటమే శక్తి పాతం. మనం కనపడని దేవుడి నుంచీ శక్తి అరువు తెచ్చుకోలేము కనుక, ఈ గురువుల ద్వారా కుండలినీ జాగృతి ద్వారా, విశ్వశక్తి లో కొంత భాగాన్ని,  స్వీకరించడమే   శక్తిపాతం, ఇప్పుడు నన్ను చూడు...నా వంట్లో వెయ్యి వోల్టుల కరెంటు ప్రవహిస్తోంది. ఈ తరంగాలు నెల రోజులు నాకు బలాన్ని ఇస్తాయి..' అంది.


'ఓహో, శక్తి పాతం అంటే...కరెంటు షాక్ కొట్టినట్టు ఉంటుంది...శక్తి మాన్ అలా వచ్చాడన్నమాట. నేనూ శక్తి పాతం తీసుకుని శక్తి వుమన్ అయిపోతా...' అనుకున్నా. ఇప్పుడు టీవీ లో స్వామిజి ఇడ్డెన్లు  వాయలు వాయలు తీసినట్టు, విడతలు విడతలుగా, ప్రేక్షకులలో కొందరికి శక్తిపాత దీక్షలు ఇస్తున్నారు. ఇది చూసిన వీక్షకులు శక్తి పాతాల కోసం ఎగబడుతున్నారు. అంతటి శక్తిమంతమయిన ఆయన, కొందరికి ఒకేసారి కరెంటు షాక్ కొట్టించగల ఆయనకు, టీవీ లో ఒక సమయం బ్లాక్ చేసుకు మరీ ఇవి ఇవ్వాల్సిన అవసరం ఏమిటి ? గుప్తంగా లోక సంక్షేమం కోసం చెయ్యచ్చు కదా!

ఏ చెట్టూ తాను చెట్టునని చెప్పుకోదు. ఏ పువ్వూ తాను పువ్వునని చెప్పుకోదు. నిజమయిన గురువుకి ఈ ఆర్భాటాలు అక్కర్లేదు. తామెంత దూరంలో ఉన్నా, శిష్యుడికి ధ్యానం, మనశ్శాంతి, కుండలినీ జాగృతీ చిటికెలో ఇవ్వగల సమర్ధులు సద్గురువులు. ఏ పుట్టలో ఏ పాముందో, అనుకుంటూ ఈ అమాయక ప్రజలు వెమ్పర్లాడుతున్నంతవరకు పుట్టలు పుట్టలుగా స్వామీజీ లు పుడుతూనే ఉంటారు. కొత్త శక్తిని అరువు తెచ్చుకోవక్కర్లేదు. ఉన్న శక్తితో ఇతరుల మనసులు గాయపరచకుండా, సన్మార్గంలో బ్రతకగలిగితే చాలు. ధర్మో రక్షతి రక్షితః.

No comments:

Post a Comment