Sunday, June 16, 2013

బిల్దర్ కు అభినందన

                                                              

మా రాచభవనం (అపార్ట్ మెంట్) కట్టించిన బిల్డర్ గారి అపార ప్రజ్ఞకి, చంద్రుడికో నూలుపోగు లాగా ఈ అరుదయిన నజరానా...ఇందులో ప్రాస కోసం ప్రయాసలు ఉండవండోయ్...సరదాగా నవ్వుకోవడానికే....

ఒరేయ్ బిల్డరు ,

కాకులు దూరని కారడవులని, చీమలు దూరని చిట్టడవులనీ పుస్తకాల్లో చదివాం కాని, అచ్చంగా అలాగే ఎలా కట్టేసావురా నాయనా ? కరెంటు పోయింది అంటే, పట్టపగలే కళ్ళు పొడుచుకున్నా ఏమీ కనిపించదు. ఇది మీరు కట్టిన గుజ్జనగూళ్ళ(అపార్ట్ మెంట్) మొదటి ప్రత్యేకత.

చీవిడి ముక్కులా నిరంతరం కారే డ్రైనేజ్ గొట్టాలు అద్భుతః . కలియుగంలో వేయ్యేల్లకొక్క నది ఎండిపోవు గాక...కాని మీ మేధాశక్తితో మీరు పెట్టించిన పైప్ లైన్ లు, వచ్చే పోయే వాళ్లకి, ఏదో ఒక పక్క కంపునీళ్ళు నెట్టి మీద వడ్డిస్తూనే ఉంటాయి. ఇది రెండవ ప్రత్యేకత.

ఎగాతీస్తే గోహత్య...దిగదీస్తే బ్రహ్మహత్య అన్నట్టు మీరు పెట్టించిన లిఫ్టు , మీ మొహం మండా, ఎక్కడ ఆగుతుందో తెలీదు. దీని పుణ్యమా అని, మేము అందరం దిగడం, దూకడం నేర్చేసుకున్నామోచ్...

అసలు ఈ పక్క నీళ్ళ కరువు లేకపోయినా, రెండు రోజులకోసారి, పొద్దుటే, పది నిముషాలు మాత్రమె మంచినీళ్ళు సరఫరా చేసే తమ అవిడియా పరమ నిక్రుష్టః...ఆ పది నిముషాల్లో బిందెలూ, గిన్నెలూ, గ్లాసులూ, గరిటెలు చేతపుచ్చుకుని, మేము చేసే యుద్ధ కాండ, మీరు బాల్చీ తన్నేముందు ఒకసారి తప్పక చూసి చావాల్సిందే.

ఈ గాలి, వెలుతురూ లేని అగ్గిపెట్టె బతుకులకి ఆటవిడుపు, మేడ పైన టెర్రస్. అది కాస్తా మూసేసి, తెరిస్తే, పైప్ లు తోక్కేస్తారంటూ, ఉన్న కాస్త వెసులుబాటూ పావురాలకి అంకితం చేసిన మీ తెలివి తేళ్ళు పట్టికెళ్ళ . పావురాల పట్ల మీరు చూపిన ఈ అపార కరుణకు అవన్నీ మీ నెత్తిమీద సామూహికంగా రెట్టలు వేసి ఋణం తీర్చుకుంటాయిట . ఓ సారి వచ్చి పోదురూ..

అమ్మేవాడికి కొనేవాడు లోకువ అన్నట్టు...అందినకాడికి అమ్మేసుకుని, పలాయనం చిత్తగించిన తమరికి మేమంతా సన్మానం చేద్దామని అనుకుంటున్నాం. అందుకోండి మా సన్మాన పత్రం...

'ఒరేయ్ పిల్లి కళ్ళాడా  ! బొంత కాకి ముక్కోడా! కాంక్రీటు గుండె వాడా!  గుండు చెంబు లాంటి మొహం పెట్టుకుని, ఉడతలు పీకిన తాటి టెంక లాంటి జుట్టేసుకుని, పంగ నామాలు పెట్టుకుని, రోడ్డు రోలరు లాగా నువ్వు దొర్లుకుంటూ వస్తుంటే, మహా భక్తుడివని అనుకున్నాం కాని, ఇలా అందరికీ పంగ నామాలు పెట్టే మాయలోడివి అనుకోలేదు. నువ్వు కట్టిన గూట్లో నువ్వే ఉండలేని అక్కుపక్షి...పంచభక్ష్య పరమాన్నాలు మింగినట్టు సిమెంట్, ఇసుక మింగిన రాక్షస భక్షి ...అడ్డదిడ్డంగా ఇన్ని ఇళ్ళు కట్టి, ఇంత మందిని ఇక్కడ కుక్కిన నువ్వు....పోతావోరేయ్ ...ఏ తీహార్ జైలుకో, చంచల్గూడ జైలుకో పోయి, జైలుపక్షిలా బ్రతికి మరీ పోతావ్...ఓరి నిన్ను నువ్వు కట్టిన అపార్ట్ మెంట్ లో బెట్ట! నిన్ను పిడకలా గోడకేసి కొట్ట ! నీ నెత్తిన పిచ్చుక గూడెట్ట ! నీ పీత బుర్రని బూరుగు చెట్టు తొర్రలో బెట్ట! ఇంకో ఇల్లు కట్టావో, నీ పని జాటర్ డమాల్...జాగ్రత్త!'

1 comment: